परिचयः పరిచయం



ఈ చిత్రాన్ని చూడండి- ఈ వాక్యాలను చదవండి-- 
బాలః ధేనుశ్చ ఉద్యానే ఉపవిశతః।
గౌః శిశోః పార్శ్వే ఆసీదతి।
శిశుః  గోవత్సం చుమ్బతే।
హస్తయోః ధేనువత్సస్య ముఖం గృహ్ణాతి।
గౌరవర్ణః బాలః ఆనన్దేన హసతి।

बालः धेनुश्च उद्याने उपविशतः। 
गौः शिशोः पार्श्वे आसीदति।
शिशुः  गोवत्सं चुम्बते।
हस्तयोः धेनुवत्सस्य मुखं गृह्णाति।
गौरवर्णः बालः आनन्देन हसति।

ఈ చిత్రాన్ని చూసి ఈ వాక్యాలను వ్రాశాను. బాగున్నాయా? సరలంగా, పరిచితంగా- ఇది చదువుతుంటే 'నాకూ సంస్కృతం వచ్చేస్తుంది' అనిపిస్తుంది కదా?
చిత్రం అంటే ఒక విచిత్రమైన ఆకర్షణ కలిగినది. దృశ్యమనేది శిక్షణ మాధ్యమానికి ఎంతో అనుకూలమైనది. ఏ చిత్రాన్ని చూసినా దానితో ఒక స్ఫురణ త్వరగా ఏర్పడుతుంది. ఆ చిత్రాన్ని గురించి ఏదో ఒక ఆలోచన, భావన లేదా ఒక స్పందన వస్తుంది. దాన్ని మనం భాష కోసం ఉపయోగించుకుంటే ఎట్లా ఉంటుంది- అని ఆలోచించి చిత్రవ్యాఖ్య అనే ఒక ప్రక్రియను మొదలుపెట్టాము.  
చిత్రవ్యాఖ్యకు స్వాగతం- అని ఆహ్వానం పలుకుతూ చిత్రవ్యాఖ్య- అనే శీర్షిక పేరు పెట్టుకున్నాము. 
వాట్సప్ సంస్కృత సదస్సులలో వీలైనప్పుడల్లా ఒక స్పందింపచేసే యోగ్యమైన చిత్రాన్ని పంపి, సంస్కృత వాక్యాలను వ్యాఖ్యగా కోరేవాళ్ళము. వారు తమాషాగా వినోదంగా లేదా ఉన్నది ఉన్నట్టుగా ఇదమిత్థంగా ఒక వాక్యమో, వాక్య సంచయమో వ్రాస్తుండేవారు.
ఈ ప్రక్రియవల్ల మరో ఉపయోగం. వ్యాఖ్య వ్రాసే వేళ పర్యాయపదాలు కేవలం ధాతువులకే కాక, ఇంకా అమరకోశం తీస్తే నామ పదాలకు కూడా బోలెడు దొరుకుతాయి. అప్పుడు అవి వివిధ అక్షరాలతో అంతమయ్యే పదాలు వాడే వేళ వాటి విభక్తులు రూపాలు మీద దృష్టి వెళుతుంది. ఆ పదం విశ్లేషించుకుంటారు. దీని వల్ల మనసులో లోపల్లోపలే ఎంతో భాషా ప్రాతిపదిక ఏర్పడుతుంది.
చిత్రాలను ఎంచుకునే వేళ- వీలైనంత వరకు తీసుకున్న చిత్రాలు ఒక ప్రామాణికంగా ఉండాలని వాటికి మంచి స్పందన వచ్చే విధంగా ఉండాలని చూసుకున్నాము. దేవుడి పరమైనవి, జ్ఞానం, ధర్మం, సత్కావ్యాలు, ఇతర సద్విషయాలు.. అట్లా అని పరిమితమేం చేయలేదు. ఏవైనా మరీ పచ్చి సామాజిక విషయాలైతే వదిలివేసి, (హిందూ ధర్మంతో ముడి పడి ఉండే సామాజికవిషయమైతే అంగీకరిస్తూ) స్పందనకై పంపేవారం.. ఎక్కువ pinterest.com నుండే తీసుకునేవారం. లేదా వేరేవైనా సదస్సులో ఏవైనా ఆసక్తికరమైనవి వస్తే బాగనిపిస్తే పంపేవారం. ఉత్త దేవుడి చిత్రాలకు మాత్రమే పరిమితి అని ఆలోచనలు కాకుండా, ఏవైనా ఆలోచన రేకెత్తించేవి పంపితే స్పందనలు బాగా వస్తాయనిపించింది. సరదా వాటితో పాటు ఆలోచింపచేసేవేవైనా ఫరవాలేదు అని పరిధి పెట్టుకున్నాము.
దేవతల చిత్రాలు పెట్టుకోవటం వెనక ఒక సాంస్కృతికకారణం ఉంది-
దేవతల పేర్లకెన్నో పర్యాయాలుంటాయి. వాళ్ళ రూపాలు, వారితో ముడిపడి ఉన్న ఆయుధాలు, అలంకరణలు, వాహనాలతో సహా లెక్కేస్తే, ఎంతో ముడి పదార్థం సంస్కృతం భాష అభ్యాసం కోసం నేరుగా దొరుకుతుంది.. అదొక్కటే కాక ఈ విషయవస్తువులు అందరికీ పరిచయం అయి ఉంటాయి. ఇంకా వాటితో సంబంధించిన ఇతివృత్తాలు ఉంటాయి. చాలా మటుకు ముఖ్య దేవతల కథలన్నీ సామాన్యులందరికీ పరిచయం ఉంటాయి. భావాలు సిద్ధంగా ఉంటాయి కనుక పదాలు వెతకటమే ఆలస్యం.

ఈ విధమైన చిత్ర వ్యాఖ్యతో గొప్ప వాక్యాలను సులువుగా రాయొచ్చు.

మనకు ఎంతో గొప్ప సామగ్రి సంస్కృతంలో సంసిద్ధంగా ఉన్న మంచి విషయ వస్తువు ఈ దేవతలే.. వ్యవహారికంగా కూడా దేవతలు ఎన్నో మనం చేసే పనులు చేస్తూంటారు. ఉండటం, తినటం, మాట్లాడటం తదితరాలు. కనుక ఆ క్రియలను కృతులను చెప్పుకుంటూ పోతే ఇంకా కూడా సామాగ్రి తయారవుతుంది. వ్యావహరిక సంస్కృతము అంటూ లేవదీసిన ఉద్యమానికి కూడా ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. అనవసరంగా ఇవి ధర్మము మతము అని చెప్పి పక్కకు పెడుతున్నారు. అది ఎంతో బాధాకరం. కనీసం సంస్కృతానికి సంబంధించినంత వరకు వీటిని భాష కోసం ఏ విధంగా ఉపయోగించవచ్చు చూసుకుంటే చాలా బాగుంటుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే-
నేను నా వంతుగా ఈ చిత్రాలకు భాష నేర్చుకునే దృష్టితో, అందులో ఉన్నవి వర్ణిస్తూ, లేదా ఒక సామాన్య కథనంలాగా ఉండే విధంగా వ్యావహారిక సరళ సంస్కృతంలో వ్రాయటానికి ప్రయత్నిస్తున్నాను. కఠిన పదాలు వాడకుండా ఆ చిత్రాన్ని చూస్తూ ఈ వాక్యాలను చదివిన వారికి సంస్కృత భాష పరంగా కలగాలని ఈ ప్రయాస. సంస్కృతార్థులకు నచ్చుతుందని, ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

--మీ సంస్కృతానురాగిణి
ఉషారాణి
 

Comments

  1. చాలా చాలా బావుంది నాకు ఎంతో ఉపయుక్తంగా ఉంది భగినీ

    ReplyDelete
  2. మీ బ్లాగు లో ఉన్నవిషయాలు చాలా బావుంటాయి భగినీ

    ReplyDelete

Post a Comment